అలవి వలల నిషేధాన్ని అమలు చేస్తాం
● ఈ అంశంపై ఏపీ అధికారులతో మాట్లాడతా
● రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
కొల్లాపూర్: కృష్ణానదిలో అలవి వలలతో వేటను పూర్తిస్థాయిలో బ్యాన్ చేస్తామని, దీనిపై ఏపీకి చెందిన పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడుతామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరితోపాటు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేత నీలం మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.122 కోట్లు కేటాయించిందని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మంత్రి జూపల్లి లేఖ పంపిస్తే కొల్లాపూర్‌లో చేపపిల్లల ఉత్పత్తి యూనిట్, మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కొల్లాపూర్ చేపలను ప్రపంచ స్థాయి మార్కెట్‌కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ మత్స్యకారుల కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులతో కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మామిడి, చేపల విక్రయాల కోసం 116 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్లు వివరించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అడుక్కుంటే పదవులు రావని, గుంజుకోవాలని ముదిరాజ్‌లకు సూచించారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులకు పోటీపడాలని, ఇందుకు ఐక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా కేంద్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైన కృషిచేస్తానన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ బీసీ ఏ గ్రూపులో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాలని మంత్రులను కోరారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, ఎల్లేని సుధాకర్‌రావు, కేతూరి వెంకటేష్, పెబ్బేటి కృష్ణయ్య, మల్లికార్జున్, వెంకటస్వామి, గాలెన్న, హుస్సేనయ్య, హరికృష్ణ, శివవర్మ, చెన్నరాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


