యూరియా.. నో స్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

యూరియా.. నో స్టాక్‌

Aug 18 2025 8:04 AM | Updated on Aug 18 2025 8:04 AM

యూరియా.. నో స్టాక్‌

యూరియా.. నో స్టాక్‌

గద్వాల వ్యవసాయం: జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అన్ని రకాల పంటల్లో యూరియాను వినియోగిస్తారు. గడిచిన కొద్ది రోజులుగా డిమాండ్‌ మేరకు జిల్లాలో లభించడం లేదు. దీంతో సరిపడా దొరకక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అన్ని ఎరువుల కన్నా ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీపై యూరియాను అందిస్తోంది. దాదాపు అన్ని రకాల పంటల్లో యూరియాను ఎరువుగా వినియోగిస్తారు. ఇది ప్రధానంగా పంటలకు నత్రజని అందిస్తుంది. మొక్కల పెరుగుదలకు, ఆకుల అభివృద్ధికి, దిగుబడిని పెంచడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, మిరప, ఇతర ఉద్యాన పంటల్లో ఇలా అన్ని పంటల్లో యూరియాను వాడతారు.

3.67 లక్షల ఎకరాలు.. 15 వేల మెట్రిక్‌ టన్నులు

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 3,67,211 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 15వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం అవుతుందని లెక్కలు వేశారు. 15వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆయా నెలలకు సరిపడా వినియోగించేలా లెక్కలు వేసి ఉంచుతారు. వరి మినహాయిస్తే మిగిలిన పంటలకు ఎకరాకు కనీసంగా రెండు బస్తాల యూరియాను వేస్తారు. అయితే గత పదిరోజుల నుంచి సరిపడా యూరియా రైతులకు లభ్యం కావడం లేదు. ఇందుకు పలు కారణాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఒక్క జూలై నెలలోనే 11500 మెట్రిక్‌ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారు.

వర్షాలతో ఊపందుకున్న సాగు

జిల్లాలో మే నెలలో వర్షాలు కురిశాయి. సీజన్‌ అంతా బాగుంటుందని ఆశించారు రైతులు. అయితే జూన్‌, జులైలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, బోర్లు, బావులు రీచార్జి కాకపోవడం వల్ల సగమే సాగు అయ్యింది. అయితే జూన్‌లో ఎగువన కురిసిన వర్షాలకు జూరాల నుంచి నీటి విడుదల జరగడంతో నారుమళ్లు పోసుకున్నారు. కాగా జూలై మూడో వారం నుంచి వర్షాలు బాగా కురిసాయి. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాగుజోరు అందుకుంది. ప్రధానంగా వరిపంటను ఎక్కువగా వేస్తున్నారు.

అనుమానాలెన్నో..

ఇదిలాఉండగా, యూరియా అధిక మొత్తంలో కొనుగోలు చేసింది ఈప్రాంతానికి చెందిన రైతులేనా..లేక ఇతర ప్రాంతాల రైతులు కొనుగోలు చేశారా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కర్ణాటకలో యూరియా కొరత ఉంది. గద్వాల ప్రాంతానికి కర్ణాటక రాష్ట్రం కేవలం 50కీ.మీ. దూరం ఉంది. గట్టు, అయిజ మండలాల్లోని పలు గ్రామాలు రాయచూర్‌కు దగరలో ఉన్నాయి. అక్కడి రైతులు కొనుగోలు చేయడం వల్లే జూలైలో డిమాండ్‌కు మించి యూరియా కొనుగోలు అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు యూరియా కొరత ఉంది అని ఆనోటా ఈనోటా ఎక్కువగా ఉండటంతో ఇక్కడి రైతులు కూడా కొంతమంది ముందు ముందుగానే కొని నిల్వ పెట్టుకున్నారని అంటున్నారు. ఏదిఏమైనా జూలై చివరివారం నుంచి ఆగస్టు నెలలో విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వరి, ఇతర పంటలు వేసిన రైతులు యూరియా అవసరం మేరకు లభ్యం కాక నానా అవస్థలు పడుతున్నారు. సింగిల్‌ విండో గోదాములకు యూరియా వచ్చిందంటే చాలు రైతులు బారులు తీరుతున్నారు. జిల్లాలో ఎక్కువగా గట్టు, కేటీదొడ్డి, అయిజ, ఉండవల్లి, మల్దకల్‌ మండలాల్లో యూరియా కొరత స్పష్టంగా కన్పిస్తోంది. ఆగస్టులో 6వేల, సెప్టెంబర్‌లో 5వేల మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు అవసరం ఉంటుంది.

దొరకట్లేదు..

రెండు ఎకరాల్లో వరి సాగు చేశాను. యూరియా కోసం సింగిల్‌విండో గోదాంకు ఈవారంలో రెండు సార్లు వెళ్లగా అక్కడ స్టాక్‌ లేక వట్టి చేతులతో తిరిగి వచ్చాను. కనీసం నాకు నాలుగు బస్తాలు కావాలి. సకాలంలో యూరియా వేస్తేనే పంట బాగా వస్తుంది.

– వెంకట్రాములు, రైతు, గట్టు

అధికారులు దృష్టి సారించాలి

నాకున్న పది ఎకరాల్లో వరి,పత్తి, మిరప పంటలు వేశాను. ఆయా పంటలకు ఇప్పుడు యూరియా వేయాలి. కాని సరిపడా యూరియా దొరకడం లేదు. టైం ప్రకారం యూరియా వేయకుంటే పంట బాగా రాదు. ఇప్పటికై నా యూరియా కొరతపై అధికారులు దృష్టి పెట్టాలి.

– గోధ జయన్న, రైతు, ఉండవల్లి

నిల్వలు ఉన్నాయి

జూలైలో యూరియా వినియోగం ఎక్కువ కావడం వల్ల అక్కడక్కడ యూరియా డిమాండ్‌ మేరకు లభించడం లేదు. అయితే జిల్లాలో ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద 200 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేట్‌ డీలర్ల వద్ద 2500 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. జిల్లాలో యూరియా కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – సక్రియానాయక్‌, డీఏఓ

నెల యూరియా వినియోగం

(మెట్రిక్‌ టన్నుల్లో)

మే 55.15

జూన్‌ 891

జులై 11,500

ఆగస్టు(ఇప్పటివరకు) 3200

జిల్లా వివరాలిలా..

సరిపడా లభ్యంకాక రైతుల అవస్థలు

వానాకాలం మొత్తానికి 15వేల మె.టన్నులు సిద్ధం చేసిన అధికారులు

జూలైలో రికార్డుస్థాయిలో 11,500 మె.టన్నుల యూరియా వినియోగంపై అనుమానాలెన్నో..

ఇటీవల వర్షాలతో జోరందుకున్న వరి సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement