
బీసీ రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం
గద్వాల: 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నడిగడ్డలో మరో ఉద్యమం చేపడతామని అఖిలపక్ష కమిటీ, ప్రజా సంఘాలు, కుల, ఉప్యాధాయ, రైతు సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసి అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి బీసీగా ఉన్నారని, కానీ బీసీలను మోసం చేస్తూ 42శాతం రిజర్వేషన్ల చట్టం పార్లమెంటులో ఆమోదం తెలపకుండా దానికి మతం రంగు పులమడం దారుణమని విమర్శించారు. రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపదికన కాదని వెనకబడిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసం అన్న విషయాన్ని బీజేపీకి తెలియకపోవడం శోచనీయమన్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో సమానత్వాన్ని నిరాకరిస్తుందని, అందుకే బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. నాయకులు వాల్మీకి, మధుసుదన్‌బాబు, వెంకట్రాములు, శంకరప్రభాకర్ మోహన్, గోపాల్‌రెడ్డి, టవర్‌మక్బుల్, బుచ్చన్న, లక్ష్మీనారాయణ, దామోదర్, రామకృష్ణ, సాదతుల్లా పాల్గొన్నారు.