
సీపీఎస్ రద్దే లక్ష్యం
వనపర్తిటౌన్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు అశనిపాతంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రూపుమాపేందుకు పీఆర్టీయూ టీఎస్ పూనుకుందని, అదే లక్ష్యంతో పని చేస్తోందని సంఘం ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఉన్న ధర్నాచౌక్ వద్ద సంఘం ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మహాధర్నా వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, ప్రధానకార్యదర్శి సూర చంద్రశేఖర్, టీఈజేఏసీ జిల్లా కన్వీనర్ సూగూరు వరప్రసాద్‌రావు, టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ప్రధానకార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి మోహన్‌బాబు, సంఘం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.