
మాంద్యం నివారణలో కేంద్రం విఫలం
గద్వాల: దేశంలో పెరిగిపోతున్న ఆర్థికమాంద్యాన్ని నివారించి యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరలు అధికమై ద్రవ్యోల్బణం పెరిగిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్‌నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల ఆదాయం తగ్గి కేంద్రీకృతమవుతున్న ఆర్థిక అసమానతలు పెరిగాయని, ప్రజల దృష్టిని మళ్లించటానికి బీహార్‌లో ప్రజలు ప్రజాస్వామిక ఓటుహక్కును నిరాకరిస్తున్నారన్నారు. చట్టబద్ధ, రాజ్యాంగ పదవులలో ఉన్నవారు చేస్తున్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికలోటు పేరుతో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు కోతవిధించడం దారుమన్నారు. రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం, బోనస్, రాజీవ్ యువవికాస్ అమలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వర్షాల వల్ల పంటనష్టం, ఇళ్లు కూలిపోయి నష్టం, మూగజీవాల మృత్యువాత వంటివాటిపై అధికారులతో ప్రత్యేక సర్వే చేయించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ సీడ్‌పత్తి రైతులకు కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, కొంతమంది సీడ్‌ఆర్గనైజర్లు ఇప్పటికీ రెండుక్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబు తూ బెదిరిస్తున్నారన్నారు. సమావేశంలో రేపల్లె దేవ దాసు, రాజు, పరంజ్యోతి, నర్సింహా, మద్దిలేటి, నర్మద, ఈదన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.