
చిగురిస్తున్న ఆశలు..
కలిసొచ్చే అంశాలెన్నో..
అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు
అలంపూర్: జిల్లాలో మరో మార్కెట్‌యార్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అయిజ సబ్‌యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా మార్చాలని రైతులు, నాయకులు ఏళ్లుగా కోరుతున్నారు. గతేడాది వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో ఈ ప్రతిపాదనలకు బీజం పడింది. అందుకు తగ్గట్టుగా అధికార పార్టీకి చెందిన నేతలు సంబంధిత శాఖ రాష్ట్ర నాయకులను కలుస్తు వినతులు అందిస్తున్నారు.
మరోసారి తెరపైకి..
జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు బీజం పడింది. 2024 సెప్టెంబర్ 13న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అలంపూర్ రాగా.. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అయిజలోని సబ్ మార్కెట్ యార్డును పూర్తి స్థాయి మార్కెట్ యార్డుగా చేయాలని వినతి పత్రం అందజేశారు. అందుకు తగ్గట్టుగానే మంత్రి అయిజలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రతిపాదనలు చేస్తే తప్పక పూర్తి స్థాయి యార్డుగా ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. గత నెలలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోదండారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. దీంతో కొత్త మార్కెట్ యార్డు ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది.
రూ.లక్షల్లో నుంచి రూ.కోట్లలో ఆదాయం
అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్‌యార్డు ఆదా యం ఏటేటా పెరుగుతూ వస్తోంది. మూడేళ్లలో ఆదాయం రెట్టింపునకు చేరింది. మార్కెట్ యార్డు ఆరంభంలో రూ.లక్షల్లో ఉన్న ఆదాయం కోట్లకు చేరింది. 2022–23 వార్షిక ఆదాయం రూ. 2.13 కోట్లు వచ్చింది. 2023–24 రూ. 3.07 కోట్లు, 2024–25లో రూ. 4.7 కోట్లు వచ్చింది. అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు పరిధిలో పుల్లూరు, అయిజ, ఎర్రవల్లిలోని మూడు చెక్‌పోస్టుల ద్వారా రూ.1.76 కోట్లు, వ్యాపార సముదాయాలు, వ్యాపారుల ద్వారా రూ.1.39 కోట్లు, అయిజ సంత మార్కెట్ యార్డు ద్వారా రూ.21.60 లక్షలు, గోదాంల ద్వారా రూ.69 లక్షలు మొత్తం రూ.4.07 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–26 వార్శిక సంవత్సరంలో ఏప్రెల్ 1 నుంచి జూలై వరకు రూ.2.61 కోట్ల ఆదాయం వచ్చింది.
కొత్త మార్కెట్‌తో లబ్ధి
పెరిగిన జనాభా, మారిన పరిస్థితులకు అనువుగా కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు జరిగితే అన్ని విధాలుగా లబ్ది జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో 8 మండలాలుగా విభజించారు. జనాభా గణయంగా పెరిగింది. అయిజలో ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డుతోపాటు అనువైన వసతులు అందుబాటులో ఉండటంతో స్థానికంగా కొత్త మార్కెట్ యార్డు కావాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త మార్కెట్ యార్డు వస్తే జిల్లాలో మొత్తం సంఖ్య మూడుకు చేరుతుంది. అంతర్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండటంతో ఆదాయం పెరగడంతోపాటు రాజకీయంగా అనేక మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలకు రైతులు పండించిన ధాన్యాలు తరలించకుండగా ఇక్కడే విక్రయించుకునే వెసలుబాటు ఉంటుంది. దీంతో రైతులకు ప్రయాణ భారం తగ్గడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
2024లో రాష్ట్ర వ్యవసాయ శాఖ
మంత్రి హామీ..
ప్రస్తుత సబ్ యార్డు ఆదాయం
రూ.4 కోట్లు
మార్కెట్‌యార్డు వస్తే మరింత పెరిగే అవకాశం..
పెరగనున్న నామినేటెడ్ పోస్టులు
అయిజ మున్సిపాలిటీలో కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఇప్పటికే సబ్ మార్కెట్ యార్డు కొనసాగుతుంది. అలంపూర్ చౌరస్తాలో అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల రైతులకు అనువుగా అలంపూర్ చౌరస్తాలో 1978లో వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి శ్రీకారం చూట్టారు. దాదాపు 26.34 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లోని 5 ఎకరాలు 100 పడకల ఆస్పత్రికి అప్పగించారు. అయిజ పెద్ద మండలంగా ఉండటంతోపాటు పట్టణం విశాలంగా విస్తరించింది. రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉత్పత్తులు పెరిగాయి. దీంతో దీన్ని దృష్టిలో ఉంచుకొని 1992లో సబ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో సబ్ మార్కెట్ యార్డు కొనసాగుతుంది. యార్డులలో ధాన్యం నిల్వ చేసే భారీ గోదాంలు, ఓపెన్ షెడ్స్, దుకాణ సముదాయాలు విశాలమైన మైదానాలు అందుబాటులో ఉన్నాయి.

చిగురిస్తున్న ఆశలు..

చిగురిస్తున్న ఆశలు..