
మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం
గద్వాల: జిల్లాలో మత్తుపదార్థాల వినియోగం, సరఫరా చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో మిషన్ పరివర్తన–మత్తుపదార్థాల వినియోగ నిర్మూలన కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. అదేవిధంగా ఆలోచనశక్తి సామర్థ్యం నశిస్తుందన్నారు. మత్తుపదార్థాల క్రయవిక్రయాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. క్రయవిక్రయాలు జరిపేవారిపై చట్టపరంగా కఠిన తీసుకుంటామన్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాప్తిచెందడం ఆందోళన కలిగించే పరిణామం అన్నారు. యువకులు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలపై నిఘా ఉంచి గమనించాలన్నారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాముఖ్యతను వివరిస్తూ యువతకు ఆధునిక సాంకేతిక విద్య, నైపుణ్యశిక్షణ అందించడంలో ఏటీసీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీఎన్‌ఎస్ మెషిన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వాహనం, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్, ఆటోమిషన్ వంటి దీర్ఘకాలిక స్వల్పకాలిక కోర్సులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గద్వాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఉపాధికల్పన అధికారి ప్రియాంక, ఎల్డీఎం శ్రీనివాసరావు, డీపీఆర్వో ఆరీఫుద్దీన్, సివిల్‌సప్‌లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్ రహిత సమాజమే లక్ష్యం
గద్వాల క్రైం: డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించే ఉద్ధేశంతో దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్‌ను అమలు చేస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం, సరఫరాపై పోలీస్ యంత్రాంగం పూర్తి నిఘా ఉంచిందని అన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.