ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్‌

Aug 13 2025 5:12 AM | Updated on Aug 13 2025 5:30 AM

● రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ రహీముద్దీన్‌, విద్యుత్‌శాఖ డీఈ తిరుపతిరావు, డీఎంహెచ్‌ఓ సిద్దప్ప, డీఏఓ సక్రియానాయక్‌ ఉన్నారు.

గద్వాల/గద్వాలటౌన్‌: పిల్లలూ ఎలా చదువుతున్నారు.. ఇంగ్లిష్‌ చదవడం వచ్చా.. అంటూ విద్యార్థులను పలకరించారు కలెక్టర్‌ సంతోష్‌. ఆయన అడిగిన ప్రశ్నకు వచ్చు సార్‌ అంటూ విద్యార్థులు బదులిచ్చారు. మంగళవారం గద్వాల మండలం పూడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి కలెక్టర్‌ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులచే పాఠాలు చదివించారు. టీచర్లు బాగా చెబుతున్నారా అని అడిగి సమాధానాలు రాబట్టారు. పదో తరగతి విద్యార్థులు చాలా మంది ఇంగ్లిష్‌లో చదివిన దానికి అర్థం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. అంతకుముందు ఉపా ధ్యాయుల హాజరు పట్టిక, విద్యార్థుల ఫెషియల్‌ రికగ్నిషన్‌, వంటగది, తాగునీరు, భోజనం నాణ్యత, స్టోర్‌రూంలోని సరుకులను కలెక్టర్‌ పరిశీలించారు. యూడైస్‌ ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చే యాలని హెచ్‌ఎంకు సూచించారు. ఆహార పదార్థా లు, కూరగాయలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్మికశాఖ కమిషనర్‌ మహేశ్‌, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి ప్రియాంక, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు ఉన్నారు.

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి..

భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తనప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వరదలతో పొంగిపొర్లే వాగులు, వంకల వద్ద ప్రమాదాలు సంభవించకుండా చూడాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం మండలస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రహీముద్దీన్‌, డీపీఓ నాగేంద్రం, డీఎంహెచ్‌ఓ డా.సిద్దప్ప, డీఏఓ సక్రియా నాయక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement