
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.
..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల
పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్‌ఎల్‌ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు
అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక
నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్