
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
అయిజ: రైతులు ఆయిల్‌పాం తోటలు సాగుచేస్తే ఇతర పండ్ల తోటలకన్నా అధిక లాభాలు గడించవచ్చని, జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పాం పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కురవపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలంలో జిల్లా ఇన్‌చార్జ్ శివ నాగిరెడ్డితో కలిసి మెగా ఆయిల్‌పామ్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయిల్‌పాం పంటలో వచ్చే దిగుబడుల గురించి తెలియజేశారు. ఇదివరకే వేసిన ఆయిల్‌పాం తోటల నుంచి దిగుబడి వస్తున్న గెలలను సేకరించేందుకు వెంకటాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న కలెక్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కలెక్షన్ సెంటర్‌లో అన్ని వసతులు త్వరలో ఏర్పాటు చేయిస్తామని అన్నారు. వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ తోటలకు అవసరమైన పరికరాలు సబ్సిడీ ధరలకు అందజేస్తామని అన్నారు. ఫర్టిలైజర్స్‌ను కూడా సబ్సిడీ ధరలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్ చేసిందని అన్నారు. ఆయిల్‌పామ్ పంటలు సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆయిల్‌ఫెడ్ అధికారులకు, ఉద్యానవన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మొక్కలను తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌ఫెడ్ మండల ఏరియా ఆఫీసర్ యుగేందర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాబాలు..
గద్వాల వ్యవసాయం: ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యానశాఖాధికారి ఎం.ఏ. అక్బర్ అన్నారు. సోమవారం మండలంలోని జిల్లెడబండలో రైతు ప్రభాకార్‌రావ్ 13 ఎకరాల్లో మెగా ఆయిల్‌పాం ప్లాంటేషన్ నిర్వహించారు. ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. తక్కువ పెట్టుడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఆయిల్‌పాం సాగులో అంతర్ పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.