
‘నులి’పేద్దాం..
ఒక్క మాత్రతో నులిపురుగులకు చెక్
గద్వాల క్రైం: ఆటపాటలతో ఉల్లాసంగా గడపాల్సిన చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి నులిపురుగులు. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తరచూ అనారోగ్యం, అలసటతో బాధపడుతున్నారు. దీంతో నులిపురుగుల నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 1 –19 సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లాలో 1,71,354 మందిని గుర్తించారు. ప్రతి ఆంగన్‌వాడీ, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ మాత్రల పంపిణీ చేయనున్నారు.
కలుషిత ఆహారమే కారణం..
నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. శరీరంలో పదేపదే నీరసం వస్తూ నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలంపాటు ఇవి ఉన్నప్పటికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మల విసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతోపాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు.
నులి పురుగుల నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ దిశగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాం. పలు జాగ్రత్తలు తీసుకుంటే నులిపురుగుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చు. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పిల్లలకు వివరించాలి.
– సిద్దప్ప, జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి
మాత్రల డోస్ ఇలా..
● ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి పాల ద్వారా, నీళ్ల ద్వారా వేయాలి.
● 2 నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు ఒక మాత్రను పొడి చేసి నీళ్ల ద్వారా మింగించాలి.
● 3 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రను నమిలి మింగించాలి.
● ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరించిన లేదా నులిమి మింగినా సరిపోతుంది.
19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాలో 1.71 లక్షల మంది
బాలల గుర్తింపు
ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో
ప్రత్యేక డ్రైవ్
నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం