
ఎట్టకేలకు..!
జూరాలలో 3వ యూనిట్ వినియోగంలోకి
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్‌ను జెన్‌కో అధికారులు బాగు చేయించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించే సమయంలో వాటికి సంబంధించిన బ్లాక్ పూడుకుపోవడంతో క్రేన్లను రప్పించి వాటి సాయంతో బ్లాక్‌ను పైకెత్తడంతో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో జూరాల క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్‌లు మొరాయించడంతో క్రేన్ల సాయంతో పైకెత్తుతున్నారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జూరాలకు మళ్లీ సమస్య తలెత్తిందా.. ప్రాజెక్టు భద్రమేనా అనే విషయాలను పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. సమస్య క్రస్ట్ గేట్లదు కాదని.. జెనన్‌కో సమస్య అంటూ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
● జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్లకు 12 గేట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. వరద నిలిచిపోతే గేట్లు మూసివేస్తారు. వీటి కి సంబంధించిన గేట్ల రోప్‌లు అప్పుడప్పుడు మొ రాయించడం సాధారమేనని, వీటితో ఎలాంటి ప్ర మాదం ఉండదని జెన్‌కో సిబ్బంది వెల్లడిస్తున్నారు.
రెండేళ్ల కిందట..
జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లకుగాను మూడో యూనిట్‌కు సంబంధించిన టర్బైన్ రెండేళ్ల కిందట కాలిపోయింది. మరమ్మతుకుగాను జెన్‌కో అధికారులు టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలస్యంగా చేపట్టారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 3వ యూనిట్‌కు నీటిని సరఫరా చేసే బ్లాక్ బురదలో ఇరుక్కొని పైకెత్తేందుకు మొరాయించడంతో అధికారులు కర్ణాటక నుంచి అధునాతన క్రేన్లను రప్పించి వాటి సాయంతో పనులు పూర్తి చేశారు.
భారీగా నిలిచిన వాహనాలు
జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్ బ్లాక్‌ను పైకెత్తే సమయంలో జెన్‌కో అధికారులు ఆనకట్టపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 వరకు మరమ్మతులు భారీ క్రేన్ల సాయంతో చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టుపై తాగేందుకు కనీసం నీరు సైతం లభించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా రాకపోకలు నిలిపివేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమస్యను వినేవారే కరువయ్యారు.
జూరాల జలాశయం క్రస్ట్‌గేట్ల రోప్‌లు మొరాయిస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్త అవాస్తవం. విద్యుదుత్పత్తి కోసం ఆరు బ్లాక్‌లకు నీటిని వదులుతున్నాం. వాటికి సంబంధించిన వ్యవహారం జెన్‌కో అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు 64 క్రస్ట్‌గేట్ల రోప్‌లు బాగానే ఉన్నాయి. ఎలాంటి ముప్పులేదు.
– ఖాజా జుబేర్ అహ్మద్,
ప్రాజెక్టు ఈఈ, గద్వాల
రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ టర్బైన్‌ను మరమ్మతుల తర్వాత ఆదివారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన బ్లాక్ బురదలో పూడుకుపోవడంతో రోప్ ద్వారా సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో పైకెత్తాం. అంతేగాని రోప్‌లు తెగిపోయాయనే మాట ల్లో వాస్తవం లేదు.
– పవన్‌కుమార్, డీఈ, జెన్‌కో
జూరాల జలాశయంపై వాహనాల రద్దీ