
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
గద్వాలటౌన్/గద్వాలన్యూటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి సాధించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 7వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 1,078 మేస్‌మెంట్ దశకు, 3850 మార్క్‌అవుట్ దశకు చేరుకున్నాయని చెప్పారు. గతంతో పోల్చితే ఈసారి మంచి పురోగతి ఉందని, ఇదే వేగాన్ని పెంచి మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉందన్నారు. అన్ని మున్సిపల్, పంచాయతీల్లో లభ్దిదారుల వివరాలను ప్రదానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలకు ఇసుక బుకింగ్ కోసం లాగిన్ ఐడీలు అందజేస్తామని, అబ్ధిదారులకు ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్‌లు లక్ష్మీనారాయణ, నర్సింగరావ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావ్, హౌసింగ్ డీఈ కాశీనాథ్, ఎంపీడీఓలు,మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల పరిశీలన
గద్వాల శివారులో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను కలెక్టర్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరిరతగతిన పూర్తి చేయాలన్నారు. ముళ్ల పొదలను తొలగించి, పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఎస్‌డీసీ శ్రీనివాసరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ డీఈ లక్ష్మన్న, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలి
జిల్లాలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ఆదర్శవంతంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ‘అటల్ వయో అభివృద్ధి యోజన’ పథకం కింద జిల్లాకు మంజూరైన డే కేర్ సెంటర్‌ను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సమక్షంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారిని సునంద, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వృద్ధులకు నాణ్యమైన, పౌష్టికాహరం అందించడంతో పాటు, శారీరక, మనసికోల్లాసం కల్గించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎరువు దుకాణాల తనిఖీ
జిల్లా కేంద్రంలోని మహంతి ఫర్టిలైజర్, శివశంకర్ ఆగ్రో ట్రేడర్స్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో యూరియా, ఇతర ఎరువుల అమ్మకం, స్టాక్ వివరాలను.. ఈపాస్ యంత్రాలు, గ్రౌండ్ నిల్వలతో పోల్చి వివరాలు తెలుసుకున్నారు. రైతు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా ఈ–పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.