
యూరియాపై ఆందోళన వద్దు
గద్వాల వ్యవసాయం: జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని డీఏఓ సక్రియానాయక్ అన్నారు. శనివారం స్థానిక పీఏసీఎస్ గోదాము వద్ద రైతులకు 20.25 మెట్రిక్ టన్నుల యూరియాను ఏఓ, ఏఈఓల పర్యవేక్షణలో పంపిణీ చేయగా ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ యూరియా కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఏసీఎస్‌లలోనే కాకుండా ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో 150 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. డీఏఓ వెంట ఏఓ ప్రతాప్‌కుమార్ ఉన్నారు.
ఈ–పాస్ ద్వారానే ఎరువులు
విక్రయించాలి
కేటీదొడ్డి: ఎరువుల డీలర్లు ఈ–పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నందిన్నె, కుచినెర్ల, చింతలకుంట గ్రామాలలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మార్పీ ధరలకే ఫర్టిలైజర్, మందులకు విక్రయించాలని, ఎరువుల దుకాణాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని ఈ –పాసు మిషన్‌లతో అమ్మకాలు జరపాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలని, ఎరువుల ధరలు, స్టాక్ వివరాలను సూచిక బోర్డుపై ప్రదర్శించాలని పేర్కొన్నారు. వారి వెంట ఏఓ రాజవర్ధన్ రెడ్డి, ఏఈఓ కిరణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.
ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందాం
గద్వాలటౌన్: బీజేపీ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. అన్ని మండలాలలో 9,10వ తేదీల నాటికి హర్‌ఘర్ తిరంగాపై కార్యశాల సన్నహాక సమావేశాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 14 వరకు అన్ని మండలాలలో తిరంగా యాత్ర నిర్వహించాలన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ, వారి విగ్రహాల దగ్గర నివాళులర్పించాలన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలన్నారు. విభజన గాయాల స్మారక దినాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. 15న ప్రతి ఒక్కరూ జెండా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, రవికుమార్, కేకేరెడ్డి, అక్కల రమాదేవి, జయశ్రీ, శివారెడ్డి, శ్యామ్‌రావు, నాగేశ్వర్‌రెడ్డి, సమతగౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,303
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 287 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.5303, కనిష్టం రూ.2940, సరాసరి రూ.2940 ధరలు లభించాయి.

యూరియాపై ఆందోళన వద్దు