
ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలి
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల నిర్మూలన కోసం ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారందరికి ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈనెల 11న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవంపై జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖతో పాటు సంబందిత ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజజమాన్యాలు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని ఆదేశించారు. నులిపురుగులు ఉండటం వల్ల పిల్లలలో రక్తహీనత, ఆకలి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. వీటివల్ల చదువులో ఏకాగ్రత కోల్పోతారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం వల్ల మెరుగుదల కన్పించిందన్నారు. అన్ని హస్టల్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మాత్రలు ఇస్తారని, బడిబయటి పిల్లలకు కూడా ఈకేంద్రాల్లోనే మాత్రలు తప్పక ఇప్పించాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, కళాశాలకు ఒక అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలను అనుసంధానం చేయాలన్నారు.
జిల్లాలో 1.71 లక్షల మంది
జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారు 1,71,354 మంది ఉన్నారని తెలిపారు. మాత్రల వలన ఎలాంటి అన్నారోగ్య సమస్యలు రావని వివరించారు. ఏడాది నుంచి రెండేళ్ల వయస్సు పిల్లలకు సగం మాత్రం పొడి చేసి ఇవ్వాలన్నారు. ఆపై వయస్సు ఉన్నవారికి ఒక మాత్ర నమిలిమింగించాలని సూచించారు. ఆర్‌ఎస్‌కే బృందాలు, పోగ్రాం అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, పంచాయతీ అధికా రి నాగేంద్రం, సంక్షేమఅధికారి సునంద, ఇంటర్మీడియేట్ అధికారి హృదయరాజ్, మున్సిపల్ కమీషనర్ దశరథ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ నుషిత, పోగ్రాం అధికారులు పాల్గొన్నారు.