
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు
గద్వాలటౌన్/ఎర్రవల్లి: శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. పలు ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించగా, ఇళ్లలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శ్రావణ పౌర్ణమికి ముందురోజు వచ్చిన శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక సరస్వతీ శిశు మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారికి ఇష్టమైన తీర్థ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, మార్కెండేయస్వామి ఆలయం, కాళికాదేవి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం, కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం, నల్లకుంటలోని శివాలయం, రాఘవేంద్ర కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. కరెన్సీ నాణేలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు గాజులు, పూలు, పండ్లు ఉంచారు. సుఖ శాంతులతో, సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
● బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.