పాలమూరుకు ఆటుపోట్లు | - | Sakshi
Sakshi News home page

పాలమూరుకు ఆటుపోట్లు

Aug 8 2025 7:55 AM | Updated on Aug 8 2025 7:55 AM

పాలమూ

పాలమూరుకు ఆటుపోట్లు

ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు

ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులు

జలాశయంలో ఇప్పటికే

నాలుగు టీఎంసీల నీటి నిల్వ

ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం

ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు

కొల్లాపూర్‌: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్‌హౌజ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు.

పరిహారం చెల్లించాకే..

నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యను ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. అయితే తమకు పూర్తిస్థాయి పరిహారం అందిన తర్వాతే ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. దీంతో పాలమూరు ప్రాజెక్టు అధికారులు కొత్తగా నీటి ఎత్తిపోతలు చేపట్టే ఆలోచనను విరమించుకున్నారు. ఒకవేళ నీటిని ఎత్తిపోస్తే సున్నపుతండాలో ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు వాయిదా వేస్తున్నారు.

నాలుగు మోటార్ల బిగింపు..

ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్‌లో ఇప్పటి వరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తి కాగా.. మరో మోటార్‌కు ఫ్రీ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో ఇంకో నాలుగు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. డెలివరీ మెయిన్స్‌ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్లేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

నార్లాపూర్‌లో నీటి నిల్వ ఇలా..

నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్‌ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్‌లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వం దృష్టిలో ఉంది..

నార్లాపూర్‌ రిజర్వాయర్‌లో ఇప్పటికే 4 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ రిజర్వాయర్‌లోకి మరిన్ని నీళ్లు ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. కానీ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు పూర్తయితేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. త్వరలోనే అన్ని సమస్యలను అధిగమించి ఈ సీజన్‌ ముగింపులోగా ఎత్తిపోతలు చేపడుతాం.

– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ

పాలమూరుకు ఆటుపోట్లు 1
1/1

పాలమూరుకు ఆటుపోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement