
వైభవంగా పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన గురువారం సుదర్శన్ నారాయణన్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతసేవ, విశేష తిరువారాదన, సన్నాయి వాయిద్యాల నడుమ పవిత్రమాలలతో గ్రామోత్సవం, యాగశాల ద్వారా తోరణ, ధ్వజకుంభారాదనలు, మహాకుంభ ఆరాదనలు, పవిత్ర ప్రతిష్ట, మూలమంత్ర హోమాలు, పవిత్ర ఆదివాస హోమాలు, లఘు పూర్ణాహుతి, మహా నైవేద్య నీరాజనములు, తీర్థ ప్రసాదగోష్టి వంటి పూజలు చేశారు. సాయంకాలం దివ్యప్రబంధ పారాయణం, యాగశాల ఆరాదనలు, నిత్యహోమం, శ్రీరామ మూలమంత్ర గాయత్రీ హోమం, లఘు పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాలను వేద మంత్రాల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్ రాజు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు సామూహిక వరలక్ష్మి వ్రతం
బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. ఆసక్తి గల భక్తులు కార్యాలయంలో రూ.1516 చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని, అప్పుడే పూజకు అవసరమైన సామగ్రిని ఇవ్వనున్నట్లు తెలిపారు.