
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం
గద్వాల/గద్వాల క్రైం/ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి నివాళులర్పించారు. ముందుగా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించగా.. కలెక్టర్ బీఎం సంతోష్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక సాధననే శ్వాసగా ఆశయంగా కొట్లాడిన వ్యక్తి గొప్పయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు, పరిశోధనలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్రపోషించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మాణం వె నక ఉన్న శక్తి ప్రొఫెసర్ జయశంకర్ విద్యారంగంలో చేసిన కృషి, సమానత్వం, ప్రాంతీయ న్యాయం వంటి అంశాలపై చేసిన అధ్యాయనాలు ఈతరం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమశాఖ అధికారి నుషిత, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
● తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ నిరంతం కృషి చేశారని ఏఆర్ డీఎస్పీ నరేందర్ రావు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.తెలంగాణ ఉద్యమంలో సకల జనులను భాగస్వామ్యం చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
● తెలంగాణ రాష్ట సిద్దాంత కర్త, రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని బీచుపల్లి పదో బెటాలియన్ ఇన్‌చార్జ్ కమాండెంట్ జయరాజు అన్నారు. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని, ప్రజల్లో ఉద్యమ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తూ రాష్ట్ర సాదన కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆయన ఆడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు.

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం