
భూ సమస్యలు సత్వరం పరిష్కరించండి
గద్వాల: రాష్ట్ర ప్రభ్వుం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో తహసీల్దార్లతో సమీక్షించారు. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్‌లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగులో ఉన్నాయని, పరిష్కారం కాని వాటికి సంబంధించి ఎంతమందికి నోటీసులు జారీ చేశారు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారా..వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ఆరా తీశారు. సక్సేషన్, పెండింగ్ ముటేషన్, పీవోపీ, డీఎస్ వంటి అన్ని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అసైన్మెంట్ భూములు పూర్తిగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలన్నారు. వచ్చే వారం నిర్వహించే సమీక్షలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా మీసేవ ద్వారా 2024 వరకు దరఖాస్తు చేసిన వివిధ సర్టిఫికెట్లు పెండింగ్‌లో లేకుండా వారంరోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. రేషన్‌కార్డు దరఖాస్తులలో చాలా వరకు పరిష్కరించగా పెండింగులో ఉన్నవాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
మందులు అందుబాటులో ఉంచాలి
గద్వాల క్రైం: సీజనల్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ప్రజలకు ఆహార అలవాట్లు, శుభత్ర, వ్యాధుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలని, అలాగే ఆస్పత్రుల్లో అవసరమైయ్యే మందులను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాలలోని గాంధీచౌక్ బస్తీ దవాఖానాను ఆయన ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు, శస్త్ర చికిత్సల రికార్డులను పరిశీలించారు. గర్భిణుల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులను మెరుగైన చికిత్సల పేరుతో మరో ఆసుపత్రికి రెఫర్ చేసిన క్రమంలో వాటికి సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతధికారులకు సిబ్బంది అందజేయలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప తదితరులు ఉన్నారు.