భూ భారతి చట్టం రైతులకు వరంలాంటిది
లింగాల/ బల్మూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం–2025 రైతులకు వరం లాంటిదని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం లింగాల, బల్మూరులోని రైతువేదికల్లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు ఎంపీతోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి ధరణి వల్ల పేద రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని, భూములు కోల్పోయారని దానిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మార్పులతో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారులు వచ్చే నెలలో గ్రామాల వారిగా పర్యటించి సదస్సులు నిర్వహిస్తారని, ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఆధార్ కార్డు తరహాలో భూమికి భూదార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందని, దీనివల్ల భూములు ఆక్రమణకు గురయ్యే అవకాశాలు ఉండవన్నారు. ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకోవడానికి ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా వారి ఆటలు సాగవని, అలా చేస్తే ప్రజలే బట్టలూడదీసి ఉరికించి కొడతారన్నారు. అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ సాదాబైనామాలు, వారసత్వ, అసైన్డ్, పొరంబోకు భూములలో ఉన్న లోపాలను సరి చేసుకోవచ్చన్నారు. భూ భారతి పోర్టల్‌లో పొందుపర్చిన రికార్డుల ఆధారంగా బ్యాంక్‌లు రుణాలు ఇస్తాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ రజిత, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, తహసీల్దార్లు పాండునాయక్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు రంగినేని శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, కాశన్నయాదవ్, రాంప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


