ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాలటౌన్: ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై సమరం సాగించాల్సి ఉంటుందని ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ఎస్జీటీ యూనియన్ ఛలో ఇందిరాపార్కు చేపట్టింది. అందులో భాగంగా ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎస్జీటీ యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరాపార్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అయిదు డీఏలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలన్నారు. పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు. వీటితో పాటు పలు డిమాండ్‌ల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్జీటీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


