ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలి
గద్వాల: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సంబంధిత అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఈ నెల మూడో వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో పొందుపర్చాలని తెలిపారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ స్వామి, డీఎం విమల, డీఏఓ సక్రియ నాయక్ తదితరులు ఉన్నారు.


