
ఈదురుగాలుల బీభత్సం
గద్వాల రూరల్/ధరూరు: జిల్లాలోని పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు చెట్లు విరిగిపడగా.. పలుచోట్ల గుడిసెల రేకులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రంతోపాటు, గద్వాల, ధరూరు, మల్దకల్, అయిజ, గట్టు, కె.టి.దొడ్డి మండలాల్లో ఈదురుగాలులు వీయగా.. గట్టు, అయిజ, ధరూరులో వర్షం కురిసింది. గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై పరమాల స్టేజీ వద్ద, గద్వాల–జూరాల డ్యాంకు వెళ్లే రహదారిపై శెట్టిఆత్మకూరు వద్ద చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడితోట పంటలకు నష్టం వాటిల్లింది. అదే విధంగా పిడుగుపాటుకు ఎద్దులు మృతిచెందాయి.
ధరూరులో రెండు గంటలపాటు..
ధరూరులో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారీ గాలులు వీచాయి. దీంతో ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్న వార సత్రాలు గాలికి లేచిపోయాయి. స్థానిక వైఎస్సార్ చౌరస్తాలో దుకాణంపై ఉన్న రేకులు ఎగిరి గద్వాల – రాయిచూరు రహదారిపై పడ్డాయి. కుర్వ వీధిలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది.
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
వాహనాల రాకపోకలకు అంతరాయం
నిలిచిన విద్యుత్ సరఫరా

ఈదురుగాలుల బీభత్సం