బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బ్రెయిన్ రెయిన్–2026 జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ గురువారం ముగిసింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వినోద్ హాజరయ్యారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులు ప్రదర్శించిన మోడల్స్‌ను పరిశీలించి ప్రశంసించారు. జోనల్‌స్థాయి ఎగ్జిబిషన్‌లో ఆరు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. అందులో భూపాలపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థి బి.శ్రీహర్షలు ప్రదర్శించిన మ్యాథమెటిక్స్ బిహైండ్ అవర్ స్మార్ట్ వరల్డ్ అంశం ఒకటి. సాంఘిక సంక్షేమ గురుకులాల జోనల్ అధికారి శారద పాల్గొన్నారు.
పాఠ్య పుస్తకాల పంపిణీ మేనేజర్ సస్పెన్షన్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల (పార్ట్–2) పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు పాఠ్య పుస్తకాల ఇన్‌చార్జ్ మేనేజర్ బానోతు సమ్మయ్యను సస్పెండ్ చేస్తూ డీఈఓ లలిత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న ఎఫ్‌ఏ–3 పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన, అభ్యసన ప్రక్రియకు ఇబ్బందులు కలుగుతున్నాయని డీఈఓ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతారాహిత్యంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
బుగులోని జాతరలో మెరుగైన వైద్యసేవలు
● డీఎంహెచ్‌ఓ మధుసూదన్
రేగొండ: బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరలో భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ మధుసూదన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో జాతరలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర సేవల కోసం 108 సర్వీస్‌లను అందుబాటులో ఉంచాలని, మందులు, ఓఆర్‌ఎస్, ఐవీ ఫ్లూయి డ్స్ నిల్వ ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీ పరిధిలోని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని పరిశీలించా రు. డాక్టర్ హిమబిందు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తిచేయాలి
● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
మంగపేట :పుష్కరఘాట్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పొదుమూరు వద్ద గోదావరి నది ఒడ్డున చేపట్టిన పుష్కరఘాట్ నిర్మాణ పనులను పీఓ గురువారం పరిశీలించారు. వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని గంపోనిగూడెం సమీపంలోని దొంగల ఒర్రె వద్ద 62 మీటర్ల పుష్కరఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ 6.45 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అదే ప్రాంతంలో 2015లో నిర్మించిన పుష్కరఘాట్ గోదావరి వరద కోతకు గురై ధ్వంసమైన విషయం తెలిసిందేనని వివరించారు. అదే ప్రాంతంలో 62 మీటర్ల నూతన పుష్కరఘాట్ నిర్మాణం, ధ్వంసమైన పుష్కరఘాట్ మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న పనులను పీఓ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రవీందర్, ఆర్‌ఐ శ్రీనివాస్, జీపీఓ రాములు, పంచాయతీ కార్యదర్శి మురళి, ఇరిగేషన్ ఏఈ రోహిత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఉన్నారు.
19 ఎంయుఎల్ 151: కరకట్ట నిర్మాణం పనులను పరిశీలిస్తున్న పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
కేయూలో అభివృద్ధి
పనులకు శంకుస్థాపన
కేయూ క్యాంపస్: కేయూలో రూ.6.90 కోట్ల వ్యయంతో గురువారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో రూ.3.75 కోట్ల వ్యయంతో విద్యార్థులకు వర్క్‌షాప్ షెడ్ల నిర్మాణానికి కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే, యూనివర్సిటీలోని మహిళా హాస్టళ్లు పద్మాక్షి, సావిత్రి బాయిపూలే, తదితర బ్లాక్‌ల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3.15 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.


