● ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిలిపివేసి కార్మిక సమస్యలను పరిష్కరించాల ని, లేని పక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ తెలి పారు. ఆగస్టు 27న ఆర్‌ఎల్సీ సమక్షంలో యాజమాన్యంతో కుదిరిన 24 డిమాండ్ల ఒప్పందంపై వెంటనే సర్క్యులర్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి హాజరైన రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఒప్పందం కుదిరి నెలలు గడుస్తున్నా అమలుకు సర్క్యులర్లు విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కోరారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు నాణ్యమైన రక్షణ పరికరాలు, బూట్లు, హెల్మెట్లు, డ్రిల్ బిట్స్, డ్రిల్ రాడ్స్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. కార్మిక సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కాలయాపన చే స్తే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం కార్మిక సమస్యలపై జీఎంకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్, నాయకులు సుధాకర్‌రెడ్డి, ఆసిఫ్ పాషా, శ్రీనివాస్, పోషం, మల్లికార్జున్, తిరుపతి, నారాయణ పాల్గొన్నారు.


