బాలల పరిరక్షణకు దేశవ్యాప్త ప్రచారం | - | Sakshi
Sakshi News home page

బాలల పరిరక్షణకు దేశవ్యాప్త ప్రచారం

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

భూపాలపల్లి అర్బన్‌: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌లో భాగంగా బుధవారం మండలంలోని గొర్లవీడు, కొత్తపల్లి, పెద్దాపూర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గోర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్‌ సివిల్‌ జడ్జి తాడూరు మహతి వైష్ణవి, కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దిలీప్‌కుమార్‌, పెద్దాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడిషనల్‌ సివిల్‌ జడ్జి అఖిల హాజరై మాట్లాడారు. బాలల పరిరక్షణతోనే దేశ భవిష్యత్‌ బాగుంటుందని, పోక్సో నేరాలు, సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నా రు. విద్యార్థులకు క్రమశిక్షణ, బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటస్వామి, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నేడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాక

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనుల పరిశీలన, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడానికి నేడు (గురువారం) ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ రానున్నారని ఈఓ మహేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన

భూపాలపల్లి అర్బన్‌: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం ఉద్యోగులు బోనాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ స్పీకర్‌, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి సమ్మెకు సంఘీభావం తెలిపి, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్‌, ప్రధాన కార్యదర్శి మ ధు, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రఘురాం, నాయకులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.

31న జాబ్‌మేళా

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 31న నిరుద్యోగ యువతకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎఫ్‌3 బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా ప్రారంభమవుతుందన్నా రు. క్యాపిటల్‌ వింగ్‌లో టెలీకాలర్స్‌ 10, శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ 10 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్‌ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన 18 ఏళ్లు పైబడిన యువత అర్హులని, నెలకు రూ.15 వే ల వేతనం ఉంటుందన్నారు. వివరాలకు 9502 468800 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ విధానాన్ని విరమించుకోవాలి

ములుగు రూరల్‌: సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక పథకం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 9 నెలల అల్పాహార బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement