కాళేశ్వరం: మేడిగడ్డ బరాజ్‌లో పుష్కలంగా నీళ్లు ఉన్నా కావాలనే తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, కళ్లు తెరిచి రైతులను, ప్రజలను ఆదుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. బుధవారం మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ నుంచి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ వరకు పెద్దపల్లి, మంథనికి చెందిన బొడ్డు రవీందర్, ఉప్పు రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో చేపట్టిన 400 కిలో మీటర్ల మహా సైకిల్ యాత్రను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ దాసరి మమతరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద పుష్కలంగా ఉన్న నీళ్లను చూసైనా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్లు తెరవాలని హితవుపలికారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాలని మంథని ఎమ్మెల్యే ఏనాడు ఆలోచన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఎల్‌నినో వచ్చిందని మూడేళ్లుగా గుర్తుకు రాని తమ్మిడిహెట్టిని తెరమీదకు తెచ్చి కంటితుడుపు చర్యలు చేపట్టారని విమర్శించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ దిగువకు వృథా పోతున్న నీటి దిశను మార్చి తెలంగాణ దశ మార్చిన గొప్ప అపర భగీరథుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కుట్ర పూరితంగా ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మేడిగడ్డ టు రంగనాయక సాగర్ వరకు మహా సైకిల్ యాత్ర ప్రారంభం


