● ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ
● కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో
ఘనంగా బతుకమ్మ సంబరాలు
భూపాలపల్లి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నా రు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధికారులు, సిబ్బంది రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో ఐడీఓసీ కార్యాలయం సందడిగా మారింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన వేడుకలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ సంకీర్త్, ఏఎస్పీ నరేష్, పోలీసు అధికారులు సైతం కాసేపు బతుకమ్మ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, రెహమాన్, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.


