మున్సిపాలిటీ అభివృద్ధి పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ అభివృద్ధి పనులు వేగవంతం

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

భూపాలపల్లి: మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి పట్టణ పరిధిలోని రోడ్లు, పైప్‌లైన్‌, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి క్రిష్ణాకాలనీ, ఓసీ 2 వరకు రోడ్లు వెడల్పులో సింగరేణి సంస్థ పైప్‌లైన్‌లు, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి సమగ్ర అంచనాలు రూపొందించాలని సూచించారు. మున్సిపాలిటీ ద్వారా చేపట్టే పనుల్లో అనవసర ఖర్చులను తగ్గించి, నిర్దేశిత బడ్జెట్‌లోనే నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. పనుల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, సింగరేణి, పీఆర్‌, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి..

చిన్నారుల బాల్యం అంగన్‌వాడీ కేంద్రాల్లో బలోపేతం అవుతుందని, ప్రతీ చిన్నారికి పోషకాహారం అందించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థానికంగా సహజంగా లభించే పోషక విలువలున్న ఆహార పదార్థాల వినియోగంపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం పోషణ చాంపియన్‌ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, అధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement