భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం తరఫున పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే పత్తి ధర అధికంగా ఉండడం, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు చేయడంతో గతేడాది పెద్దగా రైతులు కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపలేదు. చాలాచోట్ల తేమ శాతం సాకుగా చూపి మోసంచేసిన ఘటనలు కూడా అక్కడక్కడ జరగడం రైతులను కొంత నష్టపరిచింది.
1,09,442 ఎకరాలలో పత్తి సాగు
జిల్లాలో 1,09,442 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.8,667గా ధరను నిర్ణయించింది. అధికారులు చిట్యాలలో 2, కాటారంలో 2, భూపాలపల్లిలో ఒక సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయనున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ పంటను అమ్ముకుంటే రైతులు న్యాయం జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో తేమ పేరుతో రైతులకు నిర్ణయించిన ధర కంటే తక్కువగా ఇస్తారని, తూకాల్లో కూడా అవకతవకలు ఉంటాయని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పత్తిలో తేమ శాతం 8నుంచి 12 శాతం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతేడాది చాలాచోట్ల సీసీఐ కొనుగోళ్ల వద్ద రైతులను తేమ పేరుతో ఇబ్బంది పెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది పునరావృతం అయితే కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..
దిగుబడిపై ప్రభావం..
ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, తెగుళ్ల కారణంగా పత్తి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చాలాచోట్ల పత్తి పంట తెగుళ్ల బారిన పడింది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 15 క్వింటాలకు పైగా దిగుబడి వస్తుంది, గతేడాది 89,240 ఎకరాలు సాగు కాగా.. ఎకరానికి సుమారుగా 12 క్వింటాల చొప్పున 1,07,088 టన్నులు దిగుబడివచ్చింది. ఈ ఏడాది మాత్రం పంట దిగబడి సగానికి సగం ఎకరాకు 5 క్వింటాలు వస్తే ఎక్కువనేనని రైతులు వాపోతున్నారు.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి
జిల్లాలో అక్టోబర్ నెలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. పత్తి కొనుగోళ్లు, పారదర్శకంగా ఉండేందుకు రైతుల బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం ఉండాలనే నిబంధన పెట్టారు. రైతులు తమ వివరాలను కిసాన్ యాప్లో నమోదు చేసుకొని ఉండాలి.
జిల్లావ్యాప్తంగా 5 సీసీఐ కేంద్రాల ఏర్పాటు
ఈ నెల చివరివారంలో
ప్రారంభించే అవకాశం
13లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అంచనా
క్వింటాల్కు మద్దతు ధర రూ.8,667
తెగుళ్ల వ్యాప్తితో దిగుబడి తగ్గే అవకాశం


