భూపాలపల్లి అర్బన్: ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరవధిక సమ్మె నాటికి నాలుగో రోజుకు చేరింది. శుక్రవారం ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రధాన రహదారి మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఐక్యంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్, కార్యదర్శి మధుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రఘురాం, కోఆర్డినేటర్ ప్రవీణ్, డాక్టర్ జగదీశ్, సలహాదారులు శ్రీనివాస్, డాక్టర్ విజయ్, ఏఎన్ఎంలు వెంకటమ్మ, శ్రీలతలు పాల్గొన్నారు.
గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
గణపురం: శుక్రవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
సింగరేణి సంఘం
కార్యాలయాన్ని కూల్చొద్దు
భూపాలపల్లి అర్బన్: రోడ్డు విస్తరణ పేరుతో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చే ప్రయత్నాలను విరమించుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కోరారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 200 అడుగుల రోడ్డు విస్తరణపై పునరాలోచించి కార్యాలయాల కూల్చివేతను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి కార్యాలయాన్ని కూల్చవద్దని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నేరేటి రాజన్న, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్
సరఫరా చేయాలి
భూపాలపల్లి రూరల్: వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ మాధవరావు అన్నారు. భూపాలపల్లి సబ్స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ వేదికలో భూపాలపల్లి రూరల్, భూపాలపల్లి టౌన్, గణపురం(ములుగు), రేగొండ సెక్షన్ల నుంచి విద్యుత్ వినియోగదారులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ ఓవర్లోడ్ అవుతున్న డీటీఆర్లో సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం ఉన్నందున వ్యవసాయ ఫీడర్లన్నింటికీ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడం చాలా ముఖ్యం అని స్పష్టంచేశారు. నమోదైన ఫిర్యాదులన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెంబర్ టెక్నికల్ శేషాగిరిరావు, మెంబర్ (ఫైనాన్స్) సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్ఈ సదానందం, అధికారులు పాపిరెడ్డి, లక్పతి, సుందర్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


