ఆగని వేట | - | Sakshi
Sakshi News home page

ఆగని వేట

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

అడవిలో వన్యప్రాణులకు ఉచ్చులు

కాళేశ్వరం: భూపాలపల్లి, కాటారం డివిజన్‌ పరిధిలోని అడవుల్లో ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్న ఘటనలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. అడవుల్లోకి వెళ్లే గొర్రెల కాపరులు, వంట చెరుకు కోసం వెళ్లే వారు, ఇతరులు ప్రమాదవశాత్తు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వేటగాళ్లు మరోవైపు వేటాడిన వన్యప్రాణుల మాంసాన్ని కిలోల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. ఘటనలు జరిగితే తప్ప అటవీశాఖ అధికారులు అటువైపు చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

బైండింగ్‌ వైర్లే ఉచ్చులు..

బైండింగ్‌ వైర్లతో ఏర్పాటు చేసి 11కేవీ విద్యుత్‌ తీగలు వేసే ఉచ్చుల కారణంగా గేదెలు, ఎడ్లు, వన్యప్రాణులు సైతం జిల్లాలో అనేక చోట్ల నిత్యం మృతువాత పడుతున్నట్లు సమాచారం. భూపాలపల్లి, కాటారం డివిజన్‌ మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్‌, మల్హర్‌ మండలాల్లో అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉచ్చులు వేటాగాళ్లకు కాసులు తెచ్చిపెడుతుండగా.. అమాయకుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని చర్చ జరుగుతోంది.

పట్టణాలకు మాంసం?

అటవీ పల్లెల్లో వేటాడిన అడవి పందులు, కుందేళ్లు, కొండ గొర్రెలు, దుప్పులు, అడవి కోళ్ల మాంసాన్ని ప్రైవేట్‌ వాహనాల ద్వారా హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ మాంసానికి మహా డిమాండ్‌ ఉందని తెలిసింది. దీంతో ప్రస్తుతం దసరా పండగ సీజన్‌ కావడంతో పట్టణాలకు మాంసాన్ని పంపి వేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని వినికిడి. రూ.కిలోకు 800 వరకు పలుకుతుండడంతో పట్టణవాసులు పల్లెల్లో లభించే మాంసానికి ఆకర్షితులవుతున్నట్లు తెలిసింది.

రెండేళ్ల కిందట అవగాహన కార్యక్రమాలు..

రెండేళ్ల కిందట ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ, రెవెన్యూ, ఎన్పీడీసీఎల్‌ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో దండోర వేసి గ్రామసభలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు గ్రామపంచాయతీల పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఘటనలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులను తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ వంటి చర్యలు చేపట్టారు. దీంతో కొంతకాలం వేట తగ్గినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వన్యప్రాణుల వేట పుంజుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఘటనలు జరిగితే.. హడావిడి..

అడవుల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్న వారిపై నిరంతర నిఘా ఉంచాల్సిన అధికారులు, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఉచ్చులు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి వాటిని తొలగించడం, వేటగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం వంటి చర్యలు నిరంతరం చేపట్టాల్సిన అవసరం ఉంది. నిరంతరం గ్రామాల్లో పంచాయతీలతో కలిసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అడవుల్లోకి వెళ్లే గొర్రెల కాపరులు, కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు అటవీ శాఖతో పాటు పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పలువురు కోరుతున్నారు.

పలు ఘటనలు..

రెండేళ్ల కిందట కాటారం సమీపంలోని నస్తుర్‌పల్లిలో సీఎం రేంవత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ ఉచ్చుకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పోలీసులతో పాటు ఫారెస్టుశాఖలో కలకలం రేపింది.

మూడున్నరేళ్ల క్రితం మద్దులపల్లి శివారు బల్జాపూర్‌లో మంచిర్యాల జిల్లా దేవులవాడకు చెందిన ఓ వ్యక్తి వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు తగిలి మృతి చెందాడు. ఆ ఘటన జరిగిన ఏడాదిన్నర తరువాత నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పాంపారు.

నాలుగేళ్ల కిందట మల్హర్‌ మండలం తాడిచర్ల గ్రామంలో పంటపొలాలకు రక్షణగా వేసిన విద్యుత్‌ ఉచ్చుకు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

తాజాగా వారం కిందట మహాముత్తారం మండలం యామన్‌పల్లి–ఆజంనగర్‌ అటవీ ప్రాంతంలో పోడు కోసం వెళ్లి జడల అశోక్‌(32) అడవిలో ఏర్పాటు చేసిన ఉచ్చుకు తగిలి ప్రాణాలు పోగా...ఆయన మృతదేహం కనిపించకపోవడంతో మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు విచారణ జరిపి నిందితులను పట్టుకుని రిమాండుకు తరలించారు.

మహాముత్తారం ఘటనతో ఉలిక్కిపాటు

పట్టించుకోని ఫారెస్ట్‌ అధికారులు

ఘటనలు జరిగితేనే

అవగాహనలు.. హడావిడి

తనిఖీలు ముమ్మరం చేశాం..

అక్టోబర్‌ 2 నుంచి జరిగిన వన్యప్రాణి సప్తహా వారోత్సవాల్లో భాగంగా డివిజన్‌లోని ప్రతీ గ్రామంలో అనుమానం ఉన్న చోట ఇంటింటికీ సోదాలు చేపట్టాం. ఇంకా యాక్టివ్‌గా ఉన్న కేసులపై తనిఖీలు ముమ్మరం చేసి ఉచ్చులు, విద్యుత్‌ తీగలు స్వాధీనం చేస్తున్నాం. పూర్తిస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అరికడతాం. అడవి జంతువులను వేటాడినా, అడవిలో ఉచ్చులు అమర్చిన కఠిన చర్యలు తప్పవు.

– సందీప్‌రెడ్డి, ఎఫ్‌డీఓ, మహదేవపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement