భూపాలపల్లి అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను గత ఏడాదితో పోల్చి సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు. రైతులకు సకాలంలో సాగునీరు, విద్యుత్ సరఫరా అందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. భూగర్భ జలాల మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ఫామ్ పాండ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
17న ఇన్నోవేషన్ పంచాయతీ
తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 17న ములుగు కలెక్టరేట్లో ఇన్నోవేషన్ పంచాయతీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఆవిష్కర్తలు, విద్యార్థులు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
నేడు, రేపు ప్రత్యేక అధికారి పర్యటన
ఎల్‌నినో ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేడు (శుక్రవారం) రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి జిల్లాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్శఽర్మ ప్రకటనలో తెలిపారు.
భూ రీ సర్వేతో శాశ్వత పరిష్కారం
రేగొండ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న భూ రీ సర్వేతో రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్‌లో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో భూవివాదాలకు తావు లేకుండా రీ సర్వేను సమగ్రంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్ హేమ, సర్పంచ్ భిక్షపతి, సర్వే సిబ్బంది, రైతులు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


