రోడ్లపైనే విక్రయం | - | Sakshi
Sakshi News home page

రోడ్లపైనే విక్రయం

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

నిరుపయోగంగా పండ్లు, కూరగాయల మార్కెట్‌ సముదాయాలు

భూపాలపల్లి పట్టణంలో పండ్లు, కూరగాయల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్‌ సముదాయాలు ఉన్నప్పటికీ.. వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే కొనసాగుతోంది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తడంతోపాటు పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో సుమారు ఐదేళ్ల క్రితం నిర్మించిన పండ్లు, కూరగాయల దుకాణాల సముదాయాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు మంజూర్‌ నగర్‌లో నిర్మించ తలపెట్టిన కూరగాయల మార్కెట్‌ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

– భూపాలపల్లి అర్బన్‌

అంబేడ్కర్‌ సెంటర్‌, గణేశ్‌చౌక్‌, జయశంకర్‌ సెంటర్‌, మంజూర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా, ఫుట్‌పాత్‌లపై బండ్లు ఏర్పాటు చేసుకుని పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. వాహనాలు వెళ్లేందుకు పరిమిత స్థలం మాత్రమే మిగులుతోంది. కొనుగోలుదారులు కూడా రోడ్డుపైనే నిలపడంతో రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

బస్సులు, ఆటోలకు ఇబ్బందులు

అంబేడ్కర్‌ సెంటర్‌, గణేశ్‌చౌక్‌లలో సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ప్రధాన రహదారికి ఆనుకుని పండ్లు, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. రహదారిపై వ్యాపార కార్యకలాపాలు కొనసాగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మించినా.. వినియోగం లేదు

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన మార్కెట్‌ సముదాయాలు వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంజూర్‌నగర్‌లో నిలిచిపోయిన మార్కెట్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

దృష్టిసారించని మున్సిపల్‌, పోలీస్‌శాఖ

పట్టణంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్న వ్యవహారంపై మున్సిపాలిటీ, పోలీస్‌ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత అటువైపున కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ప్రధాన కూడళ్లలైన అంబేడ్కర్‌ సెంటర్‌, గణేశ్‌చౌక్‌, జయశంకర్‌ సెంటర్‌, మంజూర్‌నగర్‌ ప్రాంతాల్లో రహదారులపై వ్యాపారాల కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్‌, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.

నిలిచిపోయిన మంజూర్‌నగర్‌

మార్కెట్‌ పనులు

రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ

అంబేడ్కర్‌ సెంటర్‌లో

నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు

ప్రమాదాలకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement