ఓసీ–2లో కాపర్‌ వైరు చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

ఓసీ–2లో కాపర్‌ వైరు చోరీకి యత్నం

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్‌–2 ప్రాజెక్ట్‌ (ఓసీ–2)లో కాపర్‌ వైర్‌ చోరీకి యత్నించిన ఘటనలో ముగ్గురిని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. భూపాలపల్లి సీఐ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. ఓసీ–2లో ఆది, సోమవారంలో రాత్రి వేళలో దుండగులు చోరీకి యత్నించారు. సోమవారం అర్ధరాత్రి ఓపెన్‌కాస్టులోని పీఓ కార్యాలయ సమీపంలో కాపర్‌వైర్‌ను కట్‌ చేస్తుండగా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన ఓదారి శశాంక్‌, సాదుల వివేక్‌, శివరాత్రి మహేశ్‌లతో పాటు కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివరాత్రి రమేశ్‌, ఉదయ్‌ రాజ్‌కుమార్‌, రాజు పరారయ్యారు. ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

అధికారికంగా నిర్వహించాలి

భూపాలపల్లి రూరల్‌ : సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ నాయకులు కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ వసంతకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిషీధర్‌రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం, ఎందరో మహనీయుల త్యాగాలు, ప్రజల పోరాట స్ఫూర్తి ఫలితంగా తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని పేర్కొన్నారు.

కల్యాణం కమనీయం

రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి

చిట్యాల: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన కనకం తిరుపతిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనకం తిరుపతి విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేశారని అన్నారు. ఉద్యమాలను గుర్తించి జిల్లా ఫోరం అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనకం తిరుపతి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలివేరు రమేశ్‌, రాష్ట అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

బకాయిలు చెల్లించాలి

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి నుంచి జెన్‌కోకు సరఫరా చేసిన బొగ్గుకు, జెన్‌కో విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు విక్రయించినందుకు రావాల్సిన బకాయిలు సుమారు రూ.54 వేల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. బకాయిలు పేరుకుపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బొగ్గు బ్లాకులను చేపట్టేందుకు కూడా నిధుల కొరత ఎదురవుతోందన్నారు. ఇటీవల కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలతో సింగరేణి ఇన్‌చార్జ్‌ మంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశంలో డీఎంఎఫ్‌, సీఎస్‌ఆర్‌ నిధుల అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు సంస్థకు రావాల్సిన బకాయిలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement