● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణ పనులను వేగవంతంచేసి నిర్దేశిత లక్ష్యాలను త్వరగా సాధించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. గ్రౌండింగ్ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతీ దశను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల పురోగతిపై మండలాల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేయాలని సూచించారు. అర్హుల ఎంపికలో పేదరికమే ప్రామాణికంగా తీసుకుని వివక్షకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ నిర్మాణ పనులకు సంబంధించిన ఎంబీ నమోదులను ఎప్పటికప్పుడు పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు.


