భూపాలపల్లి అర్బన్: సింగరేణి భూపాలపల్లి ఏరియాలో మంగళవారం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. విశ్వేశ్వరయ్య దేశ అభివృద్ధికి అందించిన సేవలు, ఇంజనీరింగ్ రంగానికి చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సింగరేణిలో ఉత్పత్తితో పాటు భద్రత, నాణ్యత, సాంకేతికత, ఉత్పాదకతకు ప్రాధాన్యమిస్తూ ఇంజనీర్లు విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని కోరారు. అనంతరం ప్రపంచ ఇంజనీర్స్ డే సందర్భంగా ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతిని జీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం రామన్ వి.పాఠక్, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, వివిధ విభాగాల అధికారులు, గనుల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.


