● వర్షంతో ఓసీ–2, 3లో నిలిచిన ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షంతో ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–2, 3లో శనివారం బొగ్గు ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. గనుల్లోని పని ప్రదేశాలకు వరద నీరు చేరడంతో యంత్రాల నిర్వహణ, బొగ్గు, మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. వర్షపు నీటితో ఓపెన్‌కాస్ట్ పరిధిలోని అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. దీంతో బొగ్గు రవాణా వాహనాలు, యంత్రాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో కార్మికులు, సిబ్బంది పనులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా భూపాలపల్లి ఏరియాలో సుమారు 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. గనుల్లో నిలిచిన నీటిని తొలగించి, రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చిన అనంతరం ఉత్పత్తి పనులను పునరుద్ధరించే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఓపెన్‌కాస్ట్ గనుల్లో నీటి నిల్వలు, బురద కారణంగా ఉత్పత్తి, రవాణా పనులకు తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత వర్షాలతో గనుల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు.


