సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ బలోపేతంపై అధి ష్టానం దృష్టిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్‌కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది.
హక్కుల కోసం పోరాటం
చిట్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం పీఆర్‌టీయూ టీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అధ్యక్షతన మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంఈఓ కోడెపాక రఘుపతి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీరాణి, వాసంతి, పీడీ సూదం సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
దుకాణాలు తొలగించాలి
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఫుట్‌పాత్‌లపై ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించాలని రోడ్ సేఫ్టీ టాస్క్‌పోర్స్ టీం అధికారులు యజమానులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి గణేష్‌చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను బుధవారం పరిశీలించారు. దుకాణాల ఎదుట ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన వస్తువులు, తోపుడు బండ్లు, ఇతర వ్యాపారాలను తొలగించాలని యజమానులను ఆదేశించారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేయడం, వస్తువులు, బోర్డులు ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎన్‌హెచ్ డీఈ సింధూర, ఎస్సై శ్రావణ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు
సర్పంచ్‌ల వినతి
భూపాలపల్లి రూరల్: సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మకు విపతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ సర్పంచ్‌లకు నెలకు రూ. 30 వేల వేతనం అందించాలన్నారు. ప్రత్యక్షంగా ఎన్నికై న తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అవసరమైన అధికారాన్ని కల్పించాలన్నారు.
కాళోజీ ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకం
భూపాలపల్లి: తెలంగాణ ప్రజాకవి, ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకమని అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలను సమాజానికి ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు రత్నం, పూర్ణచందర్, కాశీరాం, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


