ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలువురు వ్యాపారులు మండల పరిధిలోని జంపన్నవాగు నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరతో విడదీయరాని అనుబంధం ఉన్న జంపన్నవాగును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. వాగు నీటిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని నమ్మకం. అలాంటి వాగులో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పలువురు వ్యాపారులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి.
జేసీబీలతో ఇసుక తీస్తూ..
జంపన్నవాగులో జేసీబీలతో పలువురు వ్యాపారులు ఇసుకను తీస్తూ ట్రాక్టర్లు, లారీల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను తరలిస్తున్నారు. గ్రామాలకు తరలిస్తూ జోరుగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ 20 ట్రిప్పుల మేర ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుకకు దాదాపుగా రూ.3 వేలు, లారీ ఇసుకను రూ.5 వేలకు అమ్ముతూ వేలల్లో సంపాదిస్తున్నారు.
ఇసుక తవ్వకాలతో ముప్పు
వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల వాగు సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. భారీగా ఇసుకను తొలగిస్తే వాగు లోతు పెరగడంతో పాటు నీటి సహజ ప్రవాహానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న స్నానఘట్టాలు దెబ్బతినే అవకాశం సైతం ఉందని చెబుతున్నారు. వాగులోని ఇసుక వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటిది ఇసుకను తరలిస్తే భూగర్భ జలాల పెంపుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తరలింపు


