చిట్యాల: ‘ఎమ్మెల్యే రావాలి–మాకు న్యాయం చేయాలి’ అని ఓ రైతు కుటుంబం గురువారం మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేసి దీక్ష చేపట్టింది. బాధిత రైతు కథనం ప్రచారం.. చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన అబ్బెంగుల రాజయ్య గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గర 14 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేసి పట్టా చేసుకున్నాడు. భూమి తమది అని భూమి అమ్మిన వ్యక్తి బంధువులు ఇటీవల భూమిలో పత్తి మొక్కలు పీకేశారు. ఎమ్మెల్యే పేరు చెబుతూ వేధించడమే కాకుండా చంపుతానని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. బెదిరింపులకు గురిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. బాధిత రైతు రాజయ్యకు సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేశ్, టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజయ్య మద్దతు తెలిపారు.


