ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

మహాముత్తారం: ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. గురువారం మహాముత్తారం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి పెండింగ్‌ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. కేసులను నాణ్యతతో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు.

జీపీ కార్యాలయం తనిఖీ

చిట్యాల: మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారిని (డీపీఓ) శ్రీలత గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, శానిటేషన్‌ పనులపై పలు సూచనలు చేశారు. పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెవెంట ఉప సర్పంచ్‌ బుర్ర వెంకటేష్‌గౌడ్‌, వార్డు సభ్యులు తౌటం నవీన్‌, పంచాయతీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

16న గర్భగుడి తొలగింపు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం ప్రధాన ఆలయ గర్భగుడి ఈనెల 16న కూల్చివేస్తారని తెలిసింది. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఈఈలు, ఇంజనీర్ల సమక్షంలో గర్భగుడి తొలగింపు చేపట్టనున్నారు. ఇప్పటికే పలు ఆలయాలు, ప్రాకారాలు తొలగించిన విషయం తెలిసిందే.

నేటినుంచి సామాజిక చైతన్య నాటకోత్సవాలు

భూపాలపల్లి అర్బన్‌: సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలు, మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఆధ్వర్యంలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నేటి(శుక్రవారం) నుంచి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటలకు స్థానిక కృష్ణకాలనీలోని సీఈఆర్‌ క్లబ్‌ మినీ ఫంక్షన్‌ హాల్‌లో నాటక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం, ఆశయాలపై ‘శరణం శరణం గచ్ఛామి’, 15న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేల సామాజిక పోరాటంపై ‘సత్యశోధన’, 16న అంబేడ్కర్‌ ఆలోచనా ప్రస్థానం, బౌద్ధ తత్వం వైపు ఆయన ప్రయాణంపై ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటకాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, సేవా సమితుల సభ్యులు పెద్దసంఖ్యలో హాజరై నాటకోత్సవాలను విజయవంతం చేయాలని జీఎం కోరారు.

అవయవదానంపై

అవగాహన కల్పించాలి

భూపాలపల్లి అర్బన్‌: అవయవ దానం గొప్పదని, మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ప్రజలను ప్రోత్సహించాలని డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ కంప అక్షయ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి రాంనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కంప అక్షయ మాట్లాడుతూ.. అవయవ దానంలో దక్షిణ భారతదేశం ముందంజలో ఉందన్నారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించి దానం చేయాలనే స్ఫూర్తిని కల్పించాలని సూచించారు. అవయవ దానం ద్వారా మరొకరికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ రఘురాం, మెడికల్‌ ఆఫీసర్‌ రోహిణి, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్‌, వెంకటేష్‌, రాజ్‌కుమార్‌, రాజు, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement