భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ నెల 20లోగా నేషనల్ అవార్‌ుడ్స టీచర్స్ వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను పూర్తిచేసి ఫైనల్ చేయాలని సూచించారు. జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కప్పతల్లి ఆట
కాళేశ్వరం : వర్షాలు సమృద్ధిగా కురవాలని మహదేవపూర్ మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు మంగళవారం కప్పతల్లి ఆట ఆడారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పచ్చటి ఆకులతో, పూలతో కప్పతల్లి బొమ్మను సిద్ధం చేసి, పల్లకీలో ఊరేగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక కాలంలోని సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కృష్ణప్రసాద్‌కు ఘన వీడ్కోలు
భూపాలపల్లి అర్బన్: ఏరియా నుంచి బదిలీపై వెళ్తున్న ఏరియా డీజీఎం (క్వాలిటీ) కృష్ణప్రసాద్‌కు మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఆయన సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, జ్యోతి, శ్యామ్‌సుందర్, రాజారావు, రాజేశ్వర్, తిరుపతి, పర్సనల్ మేనేజర్ శ్యామ్‌సుందర్, వివిధ గనుల శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఐటీడీఏ డీడీగా జనార్దన్
బాధ్యతలు
ఏటూరునాగారం: ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్)గా దబ్బగట్ల జనార్దన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఫిరంగి ఉద్యోగోన్నతిపై ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(టీడబ్ల్యూ)గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో ఓడీ (ఆన్‌డ్యూటీ డిప్యూటేషన్) ప్రాతిపదికన మంచిర్యాల జిల్లా ట్రైబల్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న జనార్దన్ నియామక ఉత్తర్వులు రద్దు అయ్యాయి. అదే విధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నుంచి అందిన ఆదేశాల మేరకు జనార్దన్ ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(ట్రైబల్ వెల్ఫేర్)గా వచ్చిన జాయినింగ్ రిపోర్టును పీఓ లెనిన్ వత్సల్ టొప్పోకు అందజేసి విధుల్లో చేరారు. అనంతరం పీఓకు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు.
‘ఏజెన్సీలో వలస నిరోధక చట్టం అమలుచేయాలి’
వాజేడు: ఏజెన్సీలో అక్రమ వలస నిరోధక చట్టం అమలు చేయాలని గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మొరుమూరులో మంగళవారం ఆదివాసీలతో సమావేశమై ఆయన మాట్లాడారు. 5వ షెడ్యూల్ పరిధిలోని వలస గిరిజనేతరులు అక్రమంగా వచ్చి ఆదివాసీల భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. వలస నిరోధక చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాబు, తిరుపతి, సుధాకర్, మహేశ్, రాజ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


