వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్‌జోషి, ఏవీ రంగనాథ్, అంబర్‌కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్‌ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి.
పార్కింగ్ సమస్య..
నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఏఆర్‌లో ఎక్కడి వారు అక్కడే..
పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్‌తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్‌ఎస్సై, ఆర్‌ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్‌ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్‌మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి.
సీసీఎస్‌లో కదలరు.. వదలరు
దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలున్నాయి.
కరువైన లా అండ్ ఆర్డర్..
వరంగల్ సబ్ డివిజన్‌లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్‌లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్‌మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
నేతల అండ.. నిబంధనలు తూచ్
వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్‌లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్‌మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు.
దృష్టి సారిస్తే...
మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు.
ఏఆర్‌లో పాతుకుపోయిన అధికారులు
సీసీఎస్‌లో ముదుర్లుతో సమస్యలు
కమిషనరేట్‌ను వీడని అవినీతి అధికారులు..
అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్‌ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్‌లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి.


