భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె.జీవన్‌కుమార్‌ను జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన బాధ్యతల స్వీకరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో న్యాయసేవల మెరుగుదల, ప్రజలకు సత్వర న్యాయం అందించే అంశాలపై పరస్పరం చర్చించారు.
పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలి
మహాముత్తారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులకు సూచించారు. బుదవారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఆర్‌ఐ భాస్కర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
92 శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో జూన్ మాసంలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా 92శాతం సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన మాసంలో 2.35లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యం చేయాల్సి ఉండగా 2.15లక్షల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. రోజు వారిగా సుమారు 7,181 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేసినట్లు చెప్పారు. రెండు ఓపెన్ కాస్టు గనుల్లో 121శాతం మట్టి వెలికితీత పనులు చేపట్టినట్లు వివరించారు. జూలై మాసంలో 3.67లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ విధించినట్లు తెలిపారు. కార్మికులు సమష్ఠి కృషి చేసి ఉత్పత్తి సామర్‌ాధ్యన్ని పెంచాలని కోరారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎప్‌ఎస్ (ప్రిలిమ్స్ కం మెయిన్స్) ఉద్యోగాలకు 10 నెలలు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈనెల 12వ తేదీ వరకు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 19న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. 10నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ సౌకర్యం ఉంటుందన్నారు.
ఉన్నత విద్యాభ్యాసానికి..
భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి కుమారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తులను కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం అందించాలన్నారు.
చెట్టుకు ఢీకొన్న ఆటో
మహాముత్తారం: మండలంలోని యామన్‌పల్లి సమీపంలో ఆటో అదుపు తప్పి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పంకెన గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం ఆటోలో ఆజంనగర్‌లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యామన్‌పల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మ, అశ్విన్, శారద, శైలజకు తీవ్రగాయాలయ్యాయి.


