భూపాలపల్లి అర్బన్: పేద ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలు ప్రారంభించినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఎంఆర్‌ఐ యంత్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జిల్లాలో పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాన్నారు. గతేడాది ఆస్పత్రిలో వెంటిలేటర్లు, సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆస్పత్రిని 100 పడకల నుంచి 300 పడకలకు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు రూ.14 కోట్ల వ్యయంతో నాలుగో అంతస్తు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే గుండె సంబంధిత చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంజీఎం తర్వాత ప్రభుత్వ రంగంలో ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు చేసిన ఆస్పత్రిగా భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిలవడం గర్వకారణమన్నారు. ఎంఆర్‌ఐ యంత్రం కోసం నిధులు సమకూర్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, హెచ్‌డీఎఫ్‌సీ క్లస్టర్ హెడ్ రాజేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


