కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం, పూజలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేవస్థానం ఆవరణలో హోటల్ నిర్వహణకు టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు మంగళవారం హోటల్ ఏర్పాటు చేయగా ఆలయ సమీపంలో వద్దని దేవస్థానం సిబ్బంది తిరిగి పంపారు. పలు దుకాణాలు, హోటల్ నిర్వహణకు సరైన సదుపాయాలు చేయలేదు. హోటల్‌కు సంబంధించిన మెటీరియల్ పూర్తిగా చెడిపోయాయని నిర్వాహకురాలు కావ్య వాపోయారు. దేవాదాయశాఖ ఉన్నతాదికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
సింగరేణి అధికారులకు
ఘన సన్మానం
భూపాలపల్లి అర్బన్: పదవీ విరమణ పొందిన భూపాలపల్లి ఏరియా ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, ఓసీపీ–3 ప్రాజెక్టు ఆఫీసర్ వాసం బిక్షమయ్యను ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన అధికారులు సంస్థ అభివృద్ధిలో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. ఉత్పత్తి లక్ష్యాల సాధన, కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాల అమలులో కవీంద్ర, భిక్షమయ్య సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, జ్యోతి, రాజేశ్వర్, రవీందర్, ములుకుంట్ల తిరుపతి, కృష్ణప్రసాద్, శ్యామ్‌సుందర్, వివిధ శాఖల అధికారులు, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఎంఓఏఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
నిజాయితీ, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ సేవల నుంచి ఉద్యోగ విరమణ పొందిన సబ్ యూనిట్ ఆఫీసర్ మొహమ్మద్ అబ్దుల్ అలీమ్ విధి నిర్వహణలో నిజాయితీ, అంకిత భావానికి నిలువెత్తు నిదరన్శమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. అబ్దుల్ అలీమ్‌ను ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. అలీమ్ తన ఉద్యోగ జీవితమంతా నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొమరయ్య, అలీమ్ కుటుంబ సభ్యులు, వైద్యాధికా రులు, మినిస్టీరియల్, పారామెడికల్ సిబ్బంది పాల్గొని ఆయన సేవలను ప్రశంసించారు.
12వ వేతన ఒప్పందం
వెంటనే పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: 12వ వేతన ఒప్పందం వెంటనే పూర్తిచేయాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులతో పాటు సింగరేణి కార్మికుల 12వ వేతన ఒప్పందం గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో జరిగిన కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జేబీసీసీఐ 12వ వేతన కమిటీ ఏర్పాటు చేసి వేతన ఒప్పంద చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.56వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయా గనుల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు నర్సింగరావు, లక్ష్మణ్, మల్లేష్, సాగర్, మల్లేష్, పునీత్‌రావు, స్వామి, శంకర్, నారాయణ, రఘుపతిరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.


