ఎంఆర్‌ఐ సేవలు షురూ | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ఐ సేవలు షురూ

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

పేదలకు స్థానికంగానే ఖరీదైన వైద్య పరీక్షలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దీంతో పేద ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎంఆర్‌ఐ పరీక్షల కోసం ప్రజలు వరంగల్‌, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సకాలంలో వ్యాధి నిర్ధారణ జరిగి మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటుకు కృషిచేసిన కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాజమాన్యాన్ని సీఎం అభినందించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్‌ భాగస్వామ్యంతో అత్యాధునిక ఎంఆర్‌ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జిల్లాకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాశ్‌రెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, సూపరిండెంటెండ్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజును కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో మంగళవారం సీఎస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనాంశాలను సీఎస్‌కు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement