ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, వన మహోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మేడారం హరిత హోటల్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, వన మహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంతాల్లో వన మహోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మేడారం పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


